పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని 12 మండలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో సహకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ మిరియాల శిరీష దేవి అన్నారు. ఆంధ్రుల జీవనాడి జాతీయ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి పరిశీలనకు సోమవారం పోలవరం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రంప ఎమ్మెల్యే శిరీష దేవి కలిశారు. ఈ సందర్భంగా నూతన పోలవరం జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవిన్యూ డివిజన్లోని 12 మండలాల మరింత అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పర్యాటకానికి మారుపేరుగా మారుమోగుతున్న గుడిసె వంటి మరెన్నో గుర్తింపు పొందిన రంపచోడవరం నియోజవర్గంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే శిరీష దేవి కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగ అభవృద్ధికి తన వంతు ప్రత్యేక కృషి ఉంటుందని ఆమెకు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
