జగ్గంపేట, జూలై 14: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ విస్తరణపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ప్రజల నిరసనలతో ఉద్రిక్తంగా మారిందని, ఈ నేపథ్యంలో అస్సాగో పరిశ్రమను పూర్తిగా తరలించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.జగ్గంపేటలోని బీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుమ్మలదొడ్డి, వెదురుపాక, అచ్చుతాపురం, బాబాజీపేట గ్రామాల ప్రజలు ఇప్పటికే పరిశ్రమ వల్ల భూగర్భ జలాల కొరత, తాగునీరు, సాగునీటి సమస్యలు, గాలి, నేల, శబ్ద కాలుష్యం, దుర్వాసన వంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు రెండు నుంచి మూడు లక్షల లీటర్ల ఆల్కహాల్ ఉత్పత్తి సామర్థ్యంతో మరో యూనిట్ ఏర్పాటు చేయాలనుకోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ లాభాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నామమాత్రపు కార్యక్రమం నిర్వహించారని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి పోలీసు బలగాలతో భయాందోళనలు సృష్టించారని అన్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు పరిశ్రమ విస్తరణను ఏకగ్రీవంగా వ్యతిరేకించడం ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అస్సాగో పరిశ్రమను గుమ్మలదొడ్డి ప్రాంతం నుంచి పూర్తిగా తరలించాలని, లేనిపక్షంలో బాధిత గ్రామాల ప్రజలతో కలిసి బీఎస్పీ ఆధ్వర్యంలో ఉధృత ప్రజా ఉద్యమం చేపడతామని జుత్తుక నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

