నక్కపల్లి జిల్లా వాణీ ప్రతినిథి : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసియున్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాడశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆలయం గాలిగోపురం వద్ద గల విశాలమైన ప్రాంగణంలోనూ మరియు ఆలయంలోనూ పెండాల్సు భారీ ఎత్తున క్యూలైన్సు, భక్తులు అందరికీ స్వామివారి ఉచిత ప్రసాదాన్ని అందజేయడానికి గాను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు గరుడాద్రి పర్వతంపై గల శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు విశేష అభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు భక్తులందరూ దర్శన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
కొండ దిగువున గల ఆలయ క్షేత్రపాలకుడు నారద మహాముని ప్రతిష్టమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలోనూ ఉపాల్యములలోనూ తెల్లవారుజామున నిత్య పూజ కైంకర్యములు నిర్వహించిన తర్వాత భక్తులందరూ రాత్రి 8 గంటల వరకు దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నారు. తొలి ఏకాదశి సయ్యన్న ఏకాదశి సందర్భంగా సాయంత్రం నాలుగున్నర గంటలకు స్థానిక శ్రీనివాస భక్త సమాజం వారి ఆధ్వర్యంలో భక్తుల గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమము జరుగుతుంది. తొలి ఏకాదశి శనివారం కూడా కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు చెప్పారు.
