పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: భారత హాకీ దిగ్గజం, హాకీ మాంత్రికుడు స్వర్గీయ మేజర్ జనరల్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “అమరావతి ఛాంపియన్షిప్ – 2026” క్రీడా పోటీల నియోజకవర్గ స్థాయి ఎంపికలు పోలవరం జిల్లాలో ఆగస్టు 3వ తేదీ (సోమవారం) నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి కె. పోతురాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆగస్టు 3 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎంపికలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 23 నుంచి ఆగస్టు 26 వరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, యోగా, బాక్సింగ్, హాకీ, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ తదితర 12 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలు అండర్-17 (బాలురు, బాలికలు) మరియు అండర్-23 (మహిళలు, పురుషులు) విభాగాల్లో నిర్వహించబడతాయని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించిందన్నారు. పోలవరం జిల్లాలోని 12 మండలాల పరిధిలో పనిచేస్తున్న పీడీలు, పీఈటీలు పాఠశాలలు, కళాశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వెంటనే నమోదు చేయించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను కూడా పెద్ద సంఖ్యలో ఎంపికలకు హాజరయ్యేలా చైతన్యపరచాలని కోరారు. ఆసక్తి కలిగిన యువ క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా ట్రైబల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె. పోతురాజు (సెల్: 9441563420, 8309117035) లేదా సీనియర్ పీడీ విండెల కృష్ణారావు (సెల్: 9441328312, 7981757239)లను సంప్రదించాలని జిల్లా క్రీడా అధికారి కె. పోతురాజు సూచించారు. ఆసక్తి గల వారు క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా నమోదు కు అవకాశం ఉందని తెలిపారు.
