నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తోట నరసింహం
జగ్గంపేట, ఆగస్టు 7:డీఎస్సీ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన AP Gen-Z WAR రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జగ్గంపేట టౌన్‌లోని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు తోట నరసింహం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు, కాకినాడ జిల్లా పరిశీలకులు డాట్ల సూర్యనారాయణ రాజు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


