దళితవాడ వద్ద కల్వర్టుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళన – మర్రి పృథ్వీరాజు
జగ్గంపేట, ఆగస్టు 30: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మొదటి నుంచి చివరి వరకు ఒకే కొలతల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి పృథ్వీరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామవరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభంలో ఏఏ కొలతలు నిర్ణయించారో, అదే విధంగా గ్రామం మొదటి నుంచి చివరి వరకు రోడ్డు నిర్మించాలని అన్నారు. రోడ్డు నిర్మాణంలో మధ్యలో కొలతలను మార్చడం లేదా అవసరానికి అనుగుణంగా ఇష్టానుసారంగా పనులు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ వాహనాలు, సుమారు 56 టన్నుల లారీలు తిరిగే అవకాశం ఉన్నందున దళితవాడ వద్ద ఉన్న తూరలు, కల్వర్టులు మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని పృథ్వీరాజు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పరిస్థితి తిరిగి ఏర్పడకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్డును ఒక్కసారి నిర్మించిన తర్వాత మళ్లీ వెంటనే రోడ్డు వేసే అవకాశం ఉండదని, అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని అన్నారు. దళితవాడ వద్ద తాత్కాలికంగా తూరలు ఏర్పాటు చేయడం కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న విధంగానే తగిన సామర్థ్యం కలిగిన కల్వర్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించి, ఒక్క దళితపేట వద్ద మాత్రమే తూరలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దళితవాడ వద్ద కల్వర్టు నిర్మించకుండా పెద్ద తూరలు మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రామవరం సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించాలని, నిబంధనలు మరియు నిర్ణయించిన కొలతల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని మర్రి పృథ్వీరాజు కోరారు.


