పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఓటర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు..పోలవరం జిల్లాలో రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా

రెండో విడత గ్రామ పంచాయతీ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో జరిగిన పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మారేడుమిల్లి, వై.రామవరం, గుర్తేడు, కూనవరం, వర రామచంద్రపురం, చింతూరు, ఏటపాక మండలాల్లో మొత్తం 1,39,883 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,00,147 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా 71.59 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. మండలాల వారీగా పరిశీలిస్తే మారేడుమిల్లి మండలంలో మొత్తం 15,267 మంది ఓటర్లకు గాను 10,694 మంది ఓటు వేయగా 70.05 శాతం పోలింగ్ నమోదైంది. వై.రామవరం మండలంలో 12,053 మంది ఓటర్లకు గాను 8,581 మంది ఓటు వేయగా 71.19 శాతం, గుర్తేడు మండలంలో 10,278 మంది ఓటర్లకు గాను 5,605 మంది ఓటు వేయగా 54.53 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అదేవిధంగా కూనవరం మండలంలో 19,145 మంది ఓటర్లకు గాను 14,477 మంది ఓటు వేయగా 75.62 శాతం, వర రామచంద్రపురం మండలంలో 19,558 మంది ఓటర్లకు గాను 14,629 మంది ఓటు వేయగా 74.80 శాతం, చింతూరు మండలంలో 30,755 మంది ఓటర్లకు గాను 21,726 మంది ఓటు వేయగా 70.64 శాతం, ఏటపాక మండలంలో 32,827 మంది ఓటర్లకు గాను 24,435 మంది ఓటు వేయగా 74.44 శాతం పోలింగ్ నమోదైందన్నారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్‌లో పాల్గొన్న వారిలో 48,087 మంది పురుషులు, 52,060 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం అని తెలియజేశారు. మండలాల వారీగా పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ సబ్ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శివ రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి భాస్కర్, డ్వామా పిడి బి రామ్ ప్రసాద్, డిఆర్డిఏ పీడీ డి.రత్నకర్ రావు, అదనపు సీఈవో మనోజ్ కుమార్, మైన్స్ ఏ డి సుబ్రమణ్యం, డిపి ఆర్వో లక్ష్మణా చార్యులు, వయోజన విద్య నోడల్ అధికారి టీ.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
