ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందుబాటులో – సబ్ రిజిస్ట్రార్ సి. రమేష్
కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూలై 21:కాకినాడ జిల్లా జగ్గంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రచయితల (లేఖరుల) సమ్మె కొనసాగుతున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని సబ్ రిజిస్ట్రార్ సి. రమేష్ తెలిపారు.రిజిస్ట్రేషన్, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలు తదితర అన్ని సంబంధిత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కార్యాలయంలోని సిబ్బంది ప్రజలకు అవసరమైన చెక్ స్లిప్‌లు, సంబంధిత చలానాలు తయారు చేయడంతో పాటు ఇతర సాధారణ సేవలను అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పారు.దస్తావేజుల రచయితల సమ్మె కారణంగా ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, రిజిస్ట్రేషన్ పనుల కోసం కార్యాలయానికి వచ్చి సేవలను వినియోగించుకోవచ్చని సబ్ రిజిస్ట్రార్ సి. రమేష్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

