ఖరీఫ్‌లో ప్రతి చుక్క నీరు విలువైనది – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా, జగ్గంపేట, ఆగస్టు 4:
ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగం ఈ ఖరీఫ్ సీజన్‌లో నీటిని అత్యంత పొదుపుగా, బాధ్యతగా వాడుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులో నిల్వలు పెరుగుతున్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజులు కీలకమైనవని ఆయన అన్నారు. ఇప్పటికే 70 శాతం వరి నాట్లు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం 10 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నీటి సరఫరాపై ఆయన కీలక ప్రకటన చేశారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం కాలువ ద్వారా కృష్ణవరం వద్ద ఏలేరులోకి ముందు 750 అనుకున్నాం కానీ ఇప్పుడు 1000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామని, అదనంగా ఏలేరు నుండి 200 క్యూసెక్కులు, రామవరం వద్ద పురుషోత్తపట్నం ఫేజ్-2 నుంచి 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ చర్యలతో ఏలేరులో నిల్వలు రోజురోజుకు పెరిగి 12 నుంచి 13 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని, అలా జరిగితే పిఠాపురం థాయి లెవెల్ వరకు నీటిని అందించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంచి రామన్న పంతులు డైరీలో అమలు చేసిన నీటి వంతుల విధాన్నే తిరిగి అమలు చేస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగా 10 రోజులకు ఒక టర్ను ఇస్తున్నాము. పిఠాపురం 16 వేల ఎకరాలకు 4 రోజులు, పెద్దాపురం 9600 ఎకరాలకు 3 రోజులు, కిర్లంపూడి సెక్షన్ 23 వేల ఎకరాలకు 3 రోజులు కేటాయించాము. కిర్లంపూడి సెక్షన్‌లో పిఠాపురం మండలంలోని కొన్ని గ్రామాలు కూడా కలుస్తాయి. 18 వేల ఎకరాలున్న జగ్గంపేట నియోజకవర్గానికి 2 రోజులు, 16 వేల ఎకరాలున్న పిఠాపురం నియోజకవర్గానికి 3 రోజులు కేటాయించడానికి కారణం జగ్గంపేట ప్రాజెక్టుకు దగ్గరగా ఉండటం వల్ల 2 రోజుల్లోనే నీరు అందుతుంది. పిఠాపురం దూరంగా ఉండటంతో 3 రోజులు అవసరమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ప్రతి రైతు నీటిని వృథా చేయకుండా పంటలు కాపాడుకోవాలని సూచించారు. ఏలేరు ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, నీటి సంఘ సభ్యులు బాధ్యత తీసుకుని ప్రతి పరివాహక ప్రాంతాన్ని పర్యటించి ఎక్కడ నీరు ఉంది, ఎక్కడ లేదు అనేది గుర్తించి రైతులకు సకాలంలో సూచనలు అందించాలని ఆదేశించారు. చివరగా రైతులు ఎవరూ అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా పంట బీమా తీసుకోవాలని జ్యోతుల నెహ్రూ కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కష్టకాలంలో కూడా రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

