గొలుగొండ, ఆగస్టు 9:
అంబేద్కర్ ఇండియా మిషన్ (AIM) గొలుగొండ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. AIM వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోలిజెడ్డి అప్పారావు, జిల్లా అధ్యక్షులు కుంచె చినదేముడు ఆదేశాల మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు సరమండ వీరబాబు ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పీవీ సునీల్‌కుమార్ AIMను స్థాపించారని తెలిపారు. ఆ లక్ష్య సాధన కోసం గ్రామస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని, పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి దళితవాడల అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు.అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులు చిట్ల అప్పారావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించి, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండల అధ్యక్షుడిగా జువ్వల వరహాలుబాబు, ప్రధాన కార్యదర్శిగా బోడరపు అప్పారావు, ఉపాధ్యక్షులుగా పాడి బాలరాజు, పులి దారబాబు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కుపరాల నర్సింగారావుతో పాటు మరో ముగ్గురు కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శులు, 10 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో AIM సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు నెల్లూరి చిరంజీవి, నియోజకవర్గ అధ్యక్షులు వాడపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

