అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బైక్ ఆలస్యంగా తీసుకురావడంపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి నర్సీపట్నం టౌన్ సిఐ గపూర్ ఇద్దరు రౌడీషీటర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆగస్టు 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బలిఘట్టం క్రికెట్ గ్రౌండ్ వద్ద బైక్‌కు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్లిన విషయంలో బైక్ ఆలస్యంగా తిరిగి తీసుకురావడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై ఒబ్బలారెడ్డి వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 116/2026, అల్లంపల్లి జయకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 117/2026 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ కేసుల్లో నిందితులైన బలిఘట్టానికి చెందిన అల్లంపల్లి జయకృష్ణ, ముకుడుపల్లి కిరణ్‌కుమార్ ఇప్పటికే రౌడీషీటర్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతి శనివారం నిర్వహించే రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో బైండ్‌ఓవర్ చేసినప్పటికీ, కొట్లాటలు, గొడవలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.ఇద్దరినీ ఆగస్టు 11న అరెస్ట్ చేసి, ఆగస్టు 12న న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు నర్సీపట్నం టౌన్ పోలీసులు వెల్లడించారు.నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పదేపదే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో నివారణ చర్యలతో పాటు అర్హత ఉంటే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలోనూ రౌడీషీటర్ కుప్పర్ల హరిని మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే ఎవరినీ ఉపేక్షించబోమని నర్సీపట్నం టౌన్ సిఐ గోపూర్ స్పష్టం చేశారు.
