అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పీవీఎస్ఎన్ రాజు అన్నారు. రోలుగుంట మండల కేంద్రంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సమావేశానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రధాన రహదారి మీదుగా సభా ప్రాంగణం వరకు జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక నేత అల్లు సత్యనారాయణ రోలుగుంటలో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పీవీఎస్ఎన్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. 1980వ దశకంలో నిర్మించిన తాగునీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, పలు కాలనీలకు తాగునీరు సక్రమంగా అందడం లేదని తెలిపారు. కొత్త తాగునీటి ట్యాంక్ నిర్మించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కోరారు. డ్రైనేజీ కాలువలు పూడుకుపోవడంతో వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, దీనివల్ల దోమల బెడద పెరుగుతోందని పేర్కొన్నారు.రోలుగుంట జనసేన అధ్యక్షుడు అరిపి త్రినాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని తెలిపారు. మండల అధ్యక్షుడు బలిజి మహారాజ్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్య, జల్ జీవన్ మిషన్ పనులతో దెబ్బతిన్న రోడ్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.సీనియర్ నేత గండి సింహాద్రి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నిధులు సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రోలుగుంటలో శాశ్వత ప్రాతిపదికన నూతన తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోడ్లు, ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. స్వార్థ రాజకీయాలకు తావులేకుండా పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో చోడవరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లం రామప్పరావు, లాలం నరసింగరావు, బుంగా కోటిబాబు, పెద్దాడ నాగేశ్వరరావు, కేశరపూడి శివాజీ, అవుగడ్డి మహేష్, బంటు నాయుడు తదితర నాయకులు, జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
