రోలుగుంట: మండలంలోని కుసుర్లపూడి గ్రామ పరిధిలోని కైసర్లవాని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోకి ట్రాక్టర్లు, పొక్లెయిన్లు తరలించి మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రామ యువత అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు.చెరువును సుందరీకరించి గ్రామానికి ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని స్థానిక యువత భావిస్తున్న తరుణంలోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే చెరువు వద్దకు చేరుకుని తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు.అయితే, తవ్వకాలు చేపడుతున్న వారు “డిపార్ట్‌మెంట్ అధికారులు చెబితేనే ఆపుతాం.. మీరెవరు అడగడానికి?” అంటూ యువతతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితి ఘర్షణకు దారితీయకుండా నిలువరించారు.అనుమతులు లేవన్న అధికారులు.తవ్వకాల వెనుక అధికారుల అనుమతులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం కావడంతో తహసీల్దార్ నాగమ్మను ఫోన్ ద్వారా వివరణ కోరగా, ఈ తవ్వకాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని, తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే ఇరిగేషన్ శాఖ నుంచి ఏమైనా అనుమతులు ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.దీనిపై ఇరిగేషన్ ఏఈ డి. సూర్యనారాయణను సంప్రదించగా, విషయం తెలియగానే సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి తవ్వకాలను తక్షణమే నిలిపివేయించినట్లు తెలిపారు.అధికారుల జోక్యంతో మట్టి తవ్వకాలు నిలిచిపోవడంతో గ్రామ యువత అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే చెరువులో మట్టి తవ్వకాలకు ఎవరు బాధ్యులు? అనుమతులు లేకుండా యంత్రాలను చెరువులోకి ఎలా తరలించారు? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యవహారం మరింత వివాదానికి దారితీయకుండా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
