
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
ఉత్తరాంధ్ర రైతుల జీవితాల్లో వెలుగులు నింపే చిరకాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలను రైతుల పొలాలకు అందించే దిశగా మరో చారిత్రాత్మక అడుగు పడనుంది. సెప్టెంబర్ 2 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట లో చేతుల మీదుగా జలహారతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగ సుధాకర్ తెలిపారు.ఈ మేరకు జనసేన పార్టీ నాయకులు తో కలిసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రైతులందరు పాల్గొనాలని కోరారు.
సుమారు 182 కిలోమీటర్ల పొడవు గల భూమి కాలువలో 110వ కిలోమీటరు వద్ద నీటిని విడుదల చేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 3,500 క్యూసెక్కులు, పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కులు—మొత్తం 5,000 క్యూసెక్కుల నీటిని భూమి కాలువకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ నీటి ద్వారా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని రైతులకు తొలి విడతగా సాగునీరు అందనుందని ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న రైతుల పొలాలకు నీరు చేరడం ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.ఈ జలహారతి కార్యక్రమాన్ని రైతుల పండుగగా భావించి మండలంలోని రైతులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల జనసేన పార్టీ తరఫున పిలుపునిచ్చారు.
రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ మహత్తర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయడంలో కృషి చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , హోంమంత్రి వంగలపూడి అనితమ్మ , పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గెడ్డం బుజ్జి లకు రైతుల తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
గోదావరి జలాలు రైతుల పొలాల్లోకి అడుగుపెడుతున్న రోజు రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసే రోజు ఇది కేవలం నీటి విడుదల కార్యక్రమం కాదు—రైతు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే చారిత్రాత్మక ఘట్టం” అని జనసేన నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు రత్నాజీ, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు హరికృష్ణ, బాబ్జి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .
