జగ్గంపేట, ఆగస్టు 2: జగ్గంపేటలోని గెద్దపేట పూలతోటలో వెలసిన శ్రీ చింతాలమ్మ, శ్రీ ముత్యాలమ్మ అమ్మవార్లకు ఆదివారం స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తులు ఆషాఢం సారెను ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవార్ల ఆలయానికి సమర్పించారు. ఆదివారం ఉదయం చింతాలమ్మ ఆలయం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి చింతాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలను దర్శించుకుంటూ భక్తి పారవశ్యంతో ఊరేగింపుగా చింతాలమ్మ ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి.


