ఇంటింటికీ వెళ్లి వ్యవసాయ సలహాలు.. వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి వ్యవసాయ సంబంధిత సమస్యలను తెలుసుకుని తగిన సూచనలు అందించనున్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి చిరంజీవి మాట్లాడుతూ.. రైతు సేవా కేంద్రాల గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ పశుసంవర్ధక సహాయకులు, సీఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్యాక్స్ సిబ్బంది సమన్వయంతో ప్రతి రైతు ఇంటిని సందర్శిస్తారని తెలిపారు.ప్రస్తుతం నెలకొంటున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, పంటల బీమా ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన మెలకువలు, పీఎండీఎస్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.అలాగే పంట మార్పిడి, అంతర పంటల సాగు, ఆరుతడి పంటల ఆవశ్యకత, విత్తన గుళికల వినియోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు నిర్వహణపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించనున్నట్లు వివరించారు.బీడుగా ఉన్న భూముల్లో స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్న పొలాల్లో తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే ప్రత్యామ్నాయ రకాలను సాగు చేసే విధంగా రైతులకు మార్గనిర్దేశం చేస్తామని వ్యవసాయ అధికారి తెలిపారు.రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది అందించే సూచనలను పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.
