HomeUncategorizedటెక్కలి వద్ద విషాద ఘటన... రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం

టెక్కలి వద్ద విషాద ఘటన… రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. టెక్కలి సమీపంలో రైలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు టెక్కలి మండలం రావివలస వద్ద రైలు పట్టాల సమీపంలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఈ నీటిలో చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో వారు పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో భువనేశ్వర్ నుంచి గుణుపూర్ వెళుతున్న రాజారాణి ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది.కురుస్తున్న భారీ వర్షం, వీస్తున్న బలమైన ఈదురు గాలుల కారణంగా వెనుక నుంచి వస్తున్న రైలు శబ్దాన్ని విద్యార్థులు గమనించలేకపోయారు. ఈ ప్రమాదంలో విశాఖ రావు, దిలీప్, శరత్, శివ అనే నలుగురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సాల్మన్ రాజు అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మృతులంతా టెక్కలి మండలం డమరు గ్రామానికి చెందిన వారని, టెక్కలిలోని ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నారని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందడంతో బాధితుల కుటుంబాల్లోను, గ్రామంలోనూ రోదనలు మిన్నంటాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments