ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
- రామవరం చెరువు వద్ద కార్యక్రమం
- హాజరైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు
జగ్గంపేట, జూన్ 6 (జిల్లా వాణి ప్రతినిధి):
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని కోమటి చెరువు వద్ద శనివారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు మరుకుర్తి గంగాధర స్వంత ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై, మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. ఉపాధి కూలీల సౌకర్యార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన గంగాధరను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలందరూ ఉపాధి హామీ పని దినాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూలీలకు మరింత ఎక్కువ వేతనాన్ని అందజేస్తోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ దొడ్డ శ్రీను, టీడీపీ నాయకులు మండపాక పెద్దకాపు, మండపాక పాపారావు, జనసేన మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర, గుర్రం వెంకటరమణ, గాది శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ మన్యం వీరన్న దొర, మరియు ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

