ఇంటింటికీ వాటర్ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా
గండేపల్లి, జూన్ 06: ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో త్రాగునీరు లేక అల్లాడిపోతున్న ఆ గ్రామ ప్రజలకు ఒక భరోసా లభించింది. వారి నీటి కష్టాలను తీరుస్తూ ఒక ఆసరా లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గండేపల్లి మండలం పి. నాయకంపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన త్రాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న పి. నాయకంపల్లి గ్రామ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మలిరెడ్డి పాపారావు తక్షణమే స్పందించారు. ‘పాపారావు యువసేన’ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దించి, గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా సురక్షితమైన మంచి నీటిని అందించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మలిరెడ్డి పాపారావు మాట్లాడుతూ.. “పాపారావు యువసేన ద్వారా నిరంతరం అనేక రకాల సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా ఊరి ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియడంతోనే ఈ రోజు ఈ ఉచిత నీటి సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడం మా బాధ్యత,” అని ఆయన తెలియజేశారు.
మలిరెడ్డి కుటుంబంపై గ్రామస్తుల ప్రశంసలు:
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో మలిరెడ్డి పాపారావు మాతృమూర్తి పి. నాయకంపల్లి గ్రామ సర్పంచ్‌గా గ్రామానికి ఎనలేని విశిష్ట సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఊరిపై ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో మలిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా వారు ఇలాంటి మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.

