అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కోమిర గ్రామంలో ప్రాథమిక పాఠశాల పరిస్థితులు దయనీయంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కోమిర స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ధర్నా నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 68 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు ఉన్న రెండు భవనాలలో ఒకటి పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే పైకప్పు కారిపోవడం, స్లాబ్‌లో పెచ్చులు ఊడిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భవనాన్ని ఇంజనీరింగ్ అధికారులు ‘కండెమ్డ్ బిల్డింగ్’గా ప్రకటించారు.మిగిలిన ఒకే భవనంలో అన్ని తరగతులు నిర్వహించడం సాధ్యంకాకపోవడంతో, సమీపంలోని రామాలయంలో 1, 2 తరగతుల విద్యార్థులకు బోధన చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో అక్కడ కూడా గోడలు చెమ్మతో కారిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా షెడ్ నిర్మించి తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ “పక్కా భవనం కోసం ప్రతిపాదనలు పంపించాం” అనే సమాధానం తప్ప ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి పాఠశాల భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని, అంతవరకు సిఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లేకపోతే స్థలం కేటాయిస్తే తమంతట తామే చందాలు వేసుకుని షెడ్ నిర్మించుకుంటామని తెలిపారు.అవసరమైతే మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు పొలం రాజు, బి. సత్తిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ, కోమిర ప్రాథమిక పాఠశాలకు తక్షణమే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, సిఎస్‌ఆర్ నిధులతో రేకుల షెడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
పిల్లల చదువు కోసం పాఠశాల భవనం నిర్మించండి కొమిర పంచాయితీ వద్ద తల్లిదండ్రులు ధర్నా.
RELATED ARTICLES
