HomeAndhra Pradeshరాష్ట్రానికి వాయు'గండం

రాష్ట్రానికి వాయు’గండం

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. గత 6 గంటల్లో ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రికి ఇది గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 140 కి.మీ, ఒడిశాలోని పూరీకి 210 కి.మీ, విశాఖకి 220 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖ–గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖాధికారులు మత్స్యకారులను హెచ్చరించారు. వచ్చే రెండు రోజులు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రానున్న 24 గంటల్లో ఏపీలోని 9 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువ స్థాయిలో ఆకస్మిక వరదల ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments