వ్యవసాయ శాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 4: కాకినాడ జిల్లా జగ్గంపేట సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుత రబీ సీజన్‌లో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ చేపట్టిన శాస్త్రీయ నమోదు ప్రక్రియలో ఈ సాగు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) గరిమెళ్ళ శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం ఉదయం అసెంబ్లీకి బయలుదేరే ముందు రావులమ్మ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి సాగు వివరాలను ఆయనకు వివరించారు. గతంతో పోలిస్తే 8 వేల ఎకరాల పెరుగుదల, సబ్ డివిజన్ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఊపందుకుంది. ప్రస్తుత సాగు విస్తీర్ణం: 27,530 ఎకరాలు గత రబీ సాగు: 19,417 ఎకరాలు. పెరిగిన విస్తీర్ణం: సుమారు 8,113 ఎకరాలుముఖ్యంగా వరి, మొక్కజొన్న, శనగలు, మినుములు వంటి పంటల సాగు గతంతో పోలిస్తే భారీగా పెరిగిందని ఏడీఏ తెలిపారు. వీటితో పాటు పెసలు, నువ్వులు, పొగాకు పంటలను కూడా రైతులు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. పంట నమోదు ప్రక్రియను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఖచ్చితమైన గణాంకాలు వెల్లడయ్యాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం రంగంలో కనిపిస్తున్న ఈ సానుకూల మార్పుపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అందుతున్న ప్రోత్సాహం, అధికారుల పనితీరు వల్ల సాగు విస్తీర్ణం పెరగడం శుభపరిణామమని పేర్కొంటూ, వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రైతులు పండించిన పంటను విక్రయించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే గండేపల్లి మండలం ఎల్లమెల్లి గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాబోయే 10-15 రోజుల్లో రబీ వరి కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సకాలంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని రైతులకు భరోసా ఇచ్చారు.

