జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) తూర్పుగోదావరి, కాకినాడ మరియు పోలవరం జిల్లాల సరిహద్దు ప్రజలకు అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గత 15 రోజులుగా పోలవరం అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలను వణికించిన పెద్దపులి, ఇప్పుడు మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి రీఎంట్రీ ఇవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోకవరం మండలం, మల్లవరం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. పులి కదలికలు స్పష్టంగా ఉండటంతో అటవీ శాఖ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ప్రధానంగా ఈ క్రింది ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు,మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డీ చేరువుప్రస్తుతం మల్లవరం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సింగారమ్మ తల్లి తీర్థం మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. జనం గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించవద్దని కోరుతున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘాపులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులు ఆధునిక సాంకేతికతను వాడుతున్నారు. పులికి ఉన్న రేడియో కాలర్ లేదా ట్రాక్ ఆధారంగా దాని సంచారాన్ని గమనిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ పులి ఎటువైపు వెళ్తుందో గుర్తిస్తున్నారు. పులి సంచారం ఉన్నందున పశువుల కాపరులు, అడవికి సమీపంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.




