ఆత్రేయపురం జిల్లా వాణి కోనసీమ జిల్లా ప్రతినిధి
రూ.1.35 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
తిరుమల తరువాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తగినట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. బుధవారం ఆయన ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రూ.1.25 కోట్లతో నిర్మించనున్న స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయంలో రూ.10లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు.కరూర్ వైశ్యా బ్యాంకు వారు దేవాలయానికి అందించిన దర్శనం, లడ్డూ టిక్కెట్లను జారీ చేసే టిక్కెట్ మిషన్ ను ప్రారంభించారు. పుష్కర ఘాట్ ను, కోనేరు అభివృద్ధి పనులతో పాటు, వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను, ఆలయం వద్ద జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన గడువు లోపుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శనివారాలు, ఏడు ప్రదక్షిణలు ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
