జగ్గంపేట, ఏప్రిల్ 22:”ప్రకృతిని రక్షిద్దాం.. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భూమిని అందిద్దాం” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం బూరుగుపూడి గ్రామంలోని తన నివాసం వద్ద ఆయన రేగుపండ్ల మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భూమాతను కాపాడుకోవడం మన మనుగడకు ఆధారంపంచభూతాలలో ప్రధానమైనది భూమి (ధరిత్రి) అని, మన జీవనాధారం మొత్తం భూమి పైనే ఆధారపడి ఉందని సూర్యచంద్ర గుర్తుచేశారు. “మనకు ఆహారాన్ని అందిస్తున్న భూమాతను మనం పరిరక్షించుకోకపోతే, భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. భూమిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమేనని” ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయమే ధరిత్రికి నివాళిపర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే వ్యవసాయ విధానాల్లో మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. పురుగుమందులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయం మరియు గో ఆధారిత వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలి. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించి పెద్దవి చేయడమే నేల తల్లికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి, భావితరాలకు కాలుష్య రహితమైన భూమిని కానుకగా ఇవ్వాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు.


