జగ్గంపేట(జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కన్నులపండువగా కన్యల జలాభిషేకం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా 500 మంది గ్రామ కన్యలు పాల్గొన్న జలాభిషేక మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని రామాలయం వద్ద గోదావరి జలాలను కలశాలలో నింపి, వాటిని నెత్తిన ధరించి పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ శోభాయాత్ర అనంతరం, సేకరించిన పవిత్ర జలాలతో రామలింగేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు.
ఆధ్యాత్మికతతో మెరిసిన ఆలయం గత రెండు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భారీ అన్నసంతర్పణ శివాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భక్తుల కోసం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముచ్చు సూరిబాబు, అర్చకులు బద్రీ నారాయణమూర్తి తెలిపారు.ఈ వేడుకల్లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేఖ బులిరాజుతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ చందక వెంకటరమణ, గల్లా శ్రీను, గడ్డం అచ్చి బాబు, గనిశెట్టి సన్యాసిరావు, మమ్మున దుర్గాప్రసాద్, కరణం సత్తిబాబు పెద్దగడ్డ శ్రీను, కందుల శ్రీనివాస్, నంగన సత్తిబాబు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


