జగ్గంపేట, ఫిబ్రవరి 15 (జిల్లా వాణి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కొనియాడారు. ఆదివారం స్థానిక రావులమ్మ నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ ముఖ్యాంశాలపై ఎమ్మెల్యే విశ్లేషణ చేశారు.చారిత్రాత్మక కేటాయింపులు: రూ. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను, ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. గత ఏడాది కంటే ఈసారి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులను రూ. 22,942 కోట్లకు పెంచడం ద్వారా పల్లెల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుందని పేర్కొన్నారు. జల వనరుల శాఖకు రూ. 28,000 కోట్లు కేటాయించారని, చంద్రబాబు నాయుడి సారథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు వంద శాతం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రాంతంలోని తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 52 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల కోసం రూ. 27,719 కోట్లు, ‘జల జీవన్ మిషన్’ కోసం రూ. 4,000 కోట్లు కేటాయించి ప్రభుత్వం తన విశ్వసనీయతను చాటుకుందన్నారు. ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “సభలో కేవలం 11 మంది సభ్యులతో, 11 నిమిషాలు మాత్రమే ఉండి.. ప్రజా సమస్యల కంటే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడటం చూస్తుంటే ‘ఆటలో అరటిపండు’ చందంగా ఉంది. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదే తప్ప అడిగితే వచ్చేది కాదని వారు గుర్తించాలి.”రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, మన ప్రాంతం ఉన్న జోన్-1కు రూ. 28 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఉత్తరాంధ్ర నుండి తూర్పుగోదావరి వరకు అభివృద్ధి జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి అచ్చెన్నాయుడులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ చైర్మన్ పైడిపాల సూరిబాబు, పిల్లా చంటిబాబు, అనుకుల శ్రీకాంత్, సర్వసిద్ధి లక్ష్మణరావు, పీల మహేష్, వైబోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


