జగ్గంపేట (జిల్లా వాణి ప్రతినిధి) అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు సకాలంలో అందకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న తాజా సంఘటన ఇందుకు అద్దం పడుతోంది. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఒక మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో 108 వాహనం కోసం ఫోన్ చేయగా, సుమారు రెండు గంటల పాటు బాధితులు ఆసుపత్రి వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న బాలింత, పసికందు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎదురుచూడటం స్థానికులను కలిచివేసింది. ప్రభుత్వ తీరుపై పులి ప్రసాద్ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ పులి ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..నిర్లక్ష్యం పరాకాష్ట, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద ప్రజల ప్రాణదాతగా ప్రారంభమైన 108 సేవలు, ప్రస్తుతం నిధుల కొరత వల్లనో లేదా నిర్వహణ లోపం వల్లనో బాధితులకు అందడం లేదని మండిపడ్డారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే వివరాల సేకరణ పేరుతో 20 నుండి 30 నిమిషాల సమయం వృధా చేస్తున్నారని, తీరా వివరాలు చెప్పాక అంబులెన్స్ అందుబాటులో లేదని చెప్పడం దారుణమని అన్నారు. స్థానికంగా ఉండాల్సిన అంబులెన్స్‌ను 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు పంపిస్తున్నారని, అది తిరిగి వచ్చే వరకు రోగులు ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అండగా ఉంటామని చెబుతున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం, వెంటనే 108 సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని పులి ప్రసాద్ డిమాండ్ చేశారు. అంబులెన్స్‌ల సంఖ్యను పెంచి, సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పేద ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

