గండేపల్లి, జిల్లావాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా గండేపల్లి
మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న మట్టి తవ్వకాలతో ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతోంది. రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని దళారులు చెరువులను గుల్ల చేస్తున్నా, అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అర్ధరాత్రి అక్రమ రవాణా గండేపల్లి మండలం ఎన్.టి. రాజాపురం రెవెన్యూ పరిధిలోని రామయ్య పాలెం శివారు కొత్తూరు చెరువులో గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక జెసిబి (JCB) యంత్రం సహాయంతో సుమారు 10 ట్రాక్టర్లతో నిరంతరాయంగా మట్టిని బయటకు తరలిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల చెరువు రూపురేఖలు మారిపోతున్నాయి. బాధ్యతారాహిత్యంగా అధికారుల సమాధానం
ఈ అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా, వారు బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల రెవెన్యూ అధికారిని వివరణ కోరగా… “ఆ చెరువు మా పరిధిలోకి రాదు, అది ఇరిగేషన్ లేదా పంచాయతీ శాఖలకు సంబంధించినది” అని చెబుతూ చేతులు దులుపుకోవడం గమనార్హం. అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేయడం మాఫియాకు వరంగా మారింది. రాజకీయ నాయకుల అండతోనే ఈ దోపిడీ జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని, ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టి తవ్వకాలను అరికట్టాలని, లేనిపక్షంలో నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


