కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోవట్లేదన్న దళిత సంఘ నాయకులు
కూటమి ప్రభుత్వంలోనైనా భవన కల నెరవేరేనా?
కలెక్టర్ ఆదేశించినా తహశీల్దార్ కాలయాపనపై ఆగ్రహం
జగ్గంపేట (జిల్లా వాణి ప్రతినిధి): జగ్గంపేట నియోజకవర్గంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంలో పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తుక నాగేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన ప్రకటనలో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు..
నియోజకవర్గంలో సుమారు 10 వేల మంది దళితులు ఉన్నారని, శుభకార్యాలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, సర్వే నంబర్ 59లో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించి, సీఎస్ఆర్ (CSR) నిధుల నుంచి రూ. కోటి మంజూరు చేయాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాపు కళ్యాణ మండపంలో జరిగిన తొలి సమావేశంలోనే స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడుకు అంబేడ్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు. “అంబేద్కర్ మీ ఒక్కరికే కాదు, మాకు కూడా దైవమే” అని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ, ఆచరణలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదని నాగేశ్వరరావు విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసి పనులు వేగంగా మొదలుపెట్టిన ప్రభుత్వం, అంబేద్కర్ భవనం విషయంలో మాత్రం మౌనం వహించడం సరికాదన్నారు. కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు..
భవన నిర్మాణంపై పీజీఆర్ఎస్ (PGRS) లో ఫిర్యాదు చేయగా, ఫైల్ ఎక్కడ ఉందో క్లారిటీ లేదని సమాచారం వచ్చిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించగా, ఆయన స్పందించి 04-12-2025 న సర్వే నంబర్ 59లోని 30 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని స్థానిక తహశీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా, తహశీల్దార్ మాత్రం కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ”మేము రోజుకు రెండుసార్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉన్నా స్థలాన్ని అప్పగించడానికి అధికారులు వెనుకాడుతున్నారు. ఎమ్మెల్యేలకు అవసరమైన పనులు నిమిషాల్లో పూర్తవుతున్నాయి కానీ, దళితుల భవనం అంటే ఎవరికీ చలనం లేదు.” అని జుత్తుక నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సర్వే నంబర్ 59లో కేటాయించిన 30 సెంట్ల స్థలాన్ని వెంటనే అప్పగించాలని, లేనిపక్షంలో ఆ స్థలాన్ని తామే స్వాధీనం చేసుకుని భవన నిర్మాణం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, భవన నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

