రావులపాలెం జిల్లా వాణి కోనసీమ జిల్లా ప్రతినిధి
పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విక్టరీ బజార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి(విక్టరీ వెంకటరెడ్డి)ఆధ్వర్యంలో స్ధానిక అపెక్స్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల వారి సహకారంతో రావులపాలెం మండలంలోని గ్రామాల్లో ఉన్న సుమారు 10 పాఠశాలల్లో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి పంటి సమస్యలను గుర్తించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ పళ్ళను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, సరైన విధంగా ఎలా బ్రష్ చేసుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అపెక్స్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యులు డాక్టర్ రేవతి అపర్ణ, డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ రావులపాలెం మండలంలోని 10 పాఠశాలల్లో సుమారు 2500 మంది విద్యార్థులను పరీక్షించగా పలువురిలో పంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పంటి సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని విద్యార్థులకు సూచించారు.
చిన్న వయసులోనే పంటి సమస్యలను గుర్తించి చికిత్స చేయిస్తే భవిష్యత్తులో పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలను నివారించవచ్చని వారు వివరించారు.
విద్యార్థుల కోసం ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తున్న విక్టరీ సంస్థల అధినేత గొలుగూరి వెంకటరెడ్డిని, వైద్య సేవలు అందిస్తున్న అపెక్స్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యులను విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
