జగ్గంపేట, మార్చి 15:(జిల్లా వాణి ప్రతినిధి) ఆయిల్ పామ్ సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారానే రైతులు అధిక లాభాలు గడించవచ్చని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ (పెద్దాపురం) డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.ఎస్. ప్రకాష్ అన్నారు. ఆదివారం జగ్గంపేటలోని వెంకటా ప్రగడ శ్రీరామ్మూర్తి పామాయిల్ తోటలో, పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో “ఆయిల్ పామ్ గెలల కోత – నాణ్యతా ప్రమాణాలు” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గెలలను కోసేటప్పుడు అవి పూర్తిగా పక్వానికి వచ్చాయో లేదో గమనించాలని, సరైన సమయంలో కోత కోయడం వల్ల గెలల బరువు పెరిగి రైతుకు అధిక ఆదాయం సమకూరుతుందని డి.జి.ఎం తెలిపారు. గెలలు కోసే వారు (హార్వెస్టర్లు) క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యత విషయంలో రైతులకు సహకరించాలని కోరారు. పక్వానికి వచ్చిన గెలలను గుర్తించడం మరియు వాటిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా కోయాలో అక్కడికక్కడే హార్వెస్టర్లకు, రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. గెలలు కోసే సమయంలో హార్వెస్టర్లు ఎదుర్కొంటున్న చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. “నాణ్యమైన దిగుబడి ఉంటేనే మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. రైతులు, గెలలు కోసే వారు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆయిల్ పామ్ సాగు లాభసాటిగా మారుతుంది.” ఎ.ఎస్. ప్రకాష్, డి.జి.ఎం, పతంజలి ఫుడ్స్ ఈ కార్యక్రమంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు మరియు హార్వెస్టర్లు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

