కొత్తపేట జిల్లా వాణి కోనసీమ జిల్లా ప్రతినిధి
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని, వాటిని పారదర్శకంగా మరియు పకడ్బందీగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)ను ఆయన సందర్శించి పరీక్షా కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల పట్ల అనవసర భయం వద్దని, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయాలని సూచించారు. ప్రశ్నాపత్రం అందిన వెంటనే తొందరపడకుండా మొదటి 15 నిమిషాలు పూర్తిగా చదివి తరువాత సమాధానాలు ప్రారంభించాలని చెప్పారు. సరైన ఆహారం తీసుకోవడం, తగిన నిద్రపోవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.పరీక్షా నియమాలను వివరించిన ఆయన నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్‌తో పాటు అవసరమైన స్టేషనరీ తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గదిలో సరిపడా వెలుతురు, ఫ్యాన్లు, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు.పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో తహశీల్దార్ రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
