జగ్గంపేట, మార్చి 17( జిల్లా వాణి ప్రతినిధి):జగ్గంపేటలోని ప్రముఖ విద్యాసంస్థ భవిష్య స్కూల్ (ప్రభంజనం) విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన నవోదయ మరియు సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఘన విజయం సాధించి, ప్రతిష్టాత్మక సీట్లను కైవసం చేసుకున్నట్లు పాఠశాల యాజమాన్యం గర్వంగా ప్రకటించింది.జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన ఆణిముత్యాలఅకాసపు నిఖిల్ సిద్ధార్థ (H.T. No: 01150200003) నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీటు సొంతం చేసుకున్నారు.దండు హరి నాగ చాతుర్య (H.T. No: 01030100006 & 1208016226) అసాధారణ ప్రతిభతో అటు నవోదయ మరియు ఇటు సైనిక స్కూల్..రెండింటిలోనూ ప్రవేశానికి అర్హత సాధించి ద్వంద్వ విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్లు పి. శేషు కుమార్ మరియు పి. లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ.. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయ బృందం అంకితభావంతో కూడిన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.”విద్యార్థుల్లోని సహజసిద్ధమైన ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే మా భవిష్య స్కూల్ లక్ష్యం. విజయం సాధించిన నిఖిల్ సిద్ధార్థ, నాగ చాతుర్యలకు మా హృదయపూర్వక అభినందనలు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాము,” అని వారు పేర్కొన్నారు.

