జగ్గంపేట, మార్చి 20(జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (NH 16) పై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. శుక్రవారం పెద్దాపురం ఐ/సి డిఎస్పీ KVV సత్యనారాయణ, జగ్గంపేట సీఐ శ్రీ బి. తిరుపతి ఆధ్వర్యంలో గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రమాదకరమైన మలుపులు, ‘బ్లాక్ స్పాట్స్’ను అధికారులు గుర్తించారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్రమాదకరమైన డివైడర్లను వెంటనే మూసివేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. జెడ్. రాగంపేట, తాళ్లూరు, మల్లేపల్లి, గండేపల్లి, మురారి గ్రామాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న దాబాల వద్ద వాహనాలను రోడ్డుపై నిలపకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి ఎస్సైలు మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

