జగ్గంపేట, మార్చి 21(జిల్లా వాణి ప్రతినిధి): జగ్గంపేట పంచాయతీ పరిధిలోని డైవర్స్ కాలనీ లబ్ధిదారులకు 16 ఏళ్ల క్రితం కేటాయించిన పట్టాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఉప సర్పంచ్ బండారు రాజా డిమాండ్ చేశారు. శనివారం డైవర్స్ కాలనీలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 170 కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకోవద్దు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, 2010లో సర్వే నంబర్ 196/2లో సుమారు 4 ఎకరాల 73 సెంట్ల భూమిని 170 మంది పేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. లబ్ధిదారులు నిరుపేదలు కావడం వల్ల, ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారని, కొందరు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు.రాజకీయ కక్షసాధింపుతో ఇప్పుడు నిరుపేదల పట్టాలను రద్దు చేసి, కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమని వారు విమర్శించారు. బాధితులు ఈ కాలనీలో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, హిజ్రాలు వంటి నిరుపేద వర్గాల వారు ఉన్నారని, గతంలో వారంతా తలా రూ. 5 వేలు పోగు చేసుకుని సొంతంగా విద్యుత్ సౌకర్యం కల్పించుకున్నారని పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పించాలిపట్టాల రద్దు ఆలోచనను పక్కన పెట్టి, కాలనీలో కనీస సౌకర్యాలైన సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోమవారం ‘చలో కాకినాడ కలెక్టరేట్’ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం నాడు ‘చలో కాకినాడ కలెక్టరేట్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు పిలుపునిచ్చారు. లబ్ధిదారులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి తమ నిరసనను తెలియజేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. సతీష్, డాన్ శ్రీను, వాసు, శ్రీను, సత్తిబాబు, తాతాజీ, వెంకటలక్ష్మి, కుమారి, బాబ్జి, శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

