గండేపల్లి, మార్చి 21(జిల్లా వాణి ప్రతినిధి):రిపబ్లికన్ ట్రేడ్ యూనియన్ (RTU) అనుబంధ విభాగమైన ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా నొక్కు భాగ్యవతి నియమితులయ్యారు. బెంగళూరులో జరిగిన సభలో RTU జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పులి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా పులి ప్రసాద్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవలపై ప్రశంసలు కురిపిస్తూనే, వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య వ్యవస్థకు ఆశాలే వెన్నెముక మాతా శిశు మరణాలను తగ్గించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భిణీలను గుర్తించడం, వారికి టీకాలు వేయించడం, ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడంలో వారి సేవలు వెలకట్టలేనివి. గ్రామ ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య వీరు బలమైన వారధులుగా పనిచేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య వివరాలను ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన, ప్రాథమిక ఔషధాల పంపిణీ, తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు సలహాలు ఇస్తూ శిక్షణ పొందిన స్థానిక మహిళలుగా వీరు సమాజానికి అండగా ఉంటున్నారు.న్యాయమైన డిమాండ్లు – ఉద్యమ కార్యాచరణఆశా వర్కర్లు ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం శోచనీయమని పులి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ. 26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరిట ప్రభుత్వం అదనపు పని భారాన్ని మోపుతోందని, గౌరవప్రదమైన వేతనం లేకుండా వారిని వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధన కోసం త్వరలోనే మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తిస్థాయిలో నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మరియు పలువురు ఆశా వర్కర్లు పాల్గొని నూతన అధ్యక్షురాలు నొక్కు భాగ్యవతికి అభినందనలు తెలిపారు.

