జగ్గంపేట, మార్చి 24 (జిల్లా వాణి ప్రతినిధి):
కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఆ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం జగ్గంపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని, అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. అభివృద్ధికి నోచుకోని కాలనీ ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ.. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నంబర్ 196/2లో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, విలేకరులు వంటి సుమారు 200 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా ఈ కాలనీ మౌలిక వసతులకు నోచుకోలేదని, దీంతో పేదలు ఇళ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములపై రాజకీయ కన్ను! ప్రస్తుతం ఆ ప్రాంతం సమీపంలో ప్రైవేట్ వెంచర్లు వెలియడంతో భూముల విలువ పెరిగిందని, దీనిపై కూటమి ప్రభుత్వ నాయకుల కన్ను పడిందని ఆయన ఆరోపించారు. విలువైన ఈ స్థలాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే పట్టాల రద్దుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పట్టాల రద్దు ప్రక్రియను ఆపాలి. లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలి. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలి. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించి లబ్ధిదారులందరికీ హౌసింగ్ లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రాజా, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. సతీష్, తోట వాసు, సత్తిబాబు, మణికుమారి, సుబ్బు, షేక్ బాబ్జి, భాను తదితరులు పాల్గొన్నారు.

