దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కోనసీమ రైతుల కల నిజమైంది. గోదావరి సెంట్రల్ డెల్టా వ్యవస్థలో భాగమైన లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ74.20 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ల కు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టు నిధుల మంజూరుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును స్వయంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
జలవనరుల శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నెం.175 ప్రకారం, ఆత్రేయపురం సమీపంలోని జీసీ ప్రధాన కాలువ వద్ద ఉన్న లొల్ల, రాలి వేర్, లాకులు మరియు దిగువ భాగంలోని నిర్మాణాల పునర్నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రారంభ అంచనా ₹77.40 కోట్లుగా ఉండగా, ప్రభుత్వం పరిశీలించి ₹74.20 కోట్లకు అనుమతి ఇచ్చింది.
లొల్ల లాకుల ఆధునీకరణతో మూడు పంటకాలువలు పునర్నిర్మాణం చేయబడనున్నాయి. దీని ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా అమలాపురం–బొబ్బర్లంక రహదారిపై లొల్ల లాకుల వద్ద వంతెన నిర్మాణం కూడా చేపట్టనున్నారు.
అమలాపురం పార్లమెంట్ పరిధిలోని కోనసీమ ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన లాభం కలగనుంది.
ఎమ్మెల్యేగా నాలుగోసారి ఎన్నికైనప్పటి నుంచి లొల్ల లాకుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బండారు సత్యానందరావు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ కీలక ప్రాజెక్టు ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
లొల్ల లాకుల ఆధునీకరణకు ₹74.20 కోట్లు మంజూరు. ఎమ్మెల్యే బండారు
RELATED ARTICLES
