జగ్గంపేట, ఏప్రిల్ 11:జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు జగ్గంపేట పోలీసులు నడుం బిగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని రహదారులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, శనివారం కీలక చర్యలు చేపట్టారు.అనధికార కటింగ్‌ల వద్ద ప్రమాదాల ముప్పుజగ్గంపేట జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా, స్థానికులు తమ సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న అనధికార డివైడర్ కటింగ్‌లను పోలీసులు గుర్తించారు. ఈ కటింగ్‌ల వద్ద వాహనదారులు అకస్మాత్తుగా మలుపులు తిరుగుతుండటంతో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రాణనష్టం సంభవిస్తోంది. దీనిని అరికట్టేందుకు జగ్గంపేట నుంచి రామవరం వెళ్లే రహదారిలో ఉన్న అనధికార డివైడర్లను సిఐ బి. తిరుపతిరావు, ఎస్సై టి. రఘునాధరావు తమ సిబ్బందితో కలిసి దగ్గరుండి మూయించి వేశారు.బ్లాక్ స్పాట్ల గుర్తింపుఈ సందర్భంగా సిఐ తిరుపతిరావు మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్లను’ ఇప్పటికే గుర్తించామని తెలిపారు.ప్రమాదాల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.రహదారి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.”ప్రజల ప్రాణ రక్షణే మా ప్రాధాన్యత. పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలు, వాహనదారులు సహకరించాలి. అతివేగాన్ని నియంత్రించి, రహదారి భద్రత నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.”— బి. తిరుపతిరావు, జగ్గంపేట సిఐ ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

