జగ్గంపేట, రామవరం ఏప్రిల్ 13(జిల్లా వాణి ప్రతినిధి):కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. జాతీయ రహదారి (NH 16) పక్కనే ఉన్న తిరుమలేశా సిరామిక్స్ ఫ్యాక్టరీ వెదజల్లుతున్న విషవాయువులు, వ్యర్థాలు గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కాసుల వేటలో పడ్డ యాజమాన్యం కళ్ళు మూసుకుపోగా, అధికారుల ఉదాసీనత సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది.విషతుల్యమైన గాలి.. అడుగుడుగునా రోగాల గుప్పిట! ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం కారకాలు నేరుగా గ్రామంలోకి చొచ్చుకురావడంతో గాలి, నీరు పూర్తిగా విషతుల్యమయ్యాయి. ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. విషపూరిత ధూళి వల్ల చర్మం రంగు మారుతూ వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు ఈ కాలుష్యానికి బలై ఆసుపత్రుల పాలవుతున్నారు. “మేము మనుషులమా లేక పురుగులమా? ఫ్యాక్టరీ నుండి వచ్చే నల్లటి పొగతో ఇంట్లో ఉండలేకపోతున్నాం. మేము రోగాల పాలవుతుంటే చూస్తూ ఊరుకుంటారా?” అంటూ గ్రామస్తులు ఆవేదనతో గర్జిస్తున్నారు. యాజమాన్యం మొండితనం.. పైపుల ఎత్తు పెంచని నిర్లక్ష్యం! కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కనీసం వ్యర్థాలు వెళ్లే పైపుల ఎత్తును పెంచాలని (High-level piping), క్రమం తప్పకుండా క్లీనింగ్ నిర్వహించాలని ప్రజలు నెత్తీనోరు బాదుకుంటున్నా యాజమాన్యం మాత్రం “బేఖాతరు” చేస్తోంది. కనీస స్పందన లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి ఫ్యాక్టరీని నడుపుతూ స్థానికుల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది.అధికారుల మౌనం.. తెరవెనుక కథ ఏమిటి?ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు రావడం లేదు? కళ్లముందే కాలుష్యం కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడానికి అడ్డు ఏమిటి?అధికారుల పర్యవేక్షణ లోపించిందా.. లేక యాజమాన్యంతో చేతులు కలిపారా? తక్షణ చర్యలు లేకుంటే ఉద్యమం తప్పదు!ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తున్న తిరుమలేశా సిరామిక్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని రామవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

