జగ్గంపేట, ఏప్రిల్ 15:కాకినాడ జిల్లా జగ్గంపేట శివారులో బుధవారం సాయంత్రం భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై రామవరం సమీపంలో గల ఆర్.సి.యం చర్చి వద్ద ఆర్టీసీ బస్సు, తాటి దుంగల ట్రాక్టర్ పరస్పరం ఢీకొన్నాయి. తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో తుని నుండి జగ్గంపేట బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో తాటి దుంగలతో లోడు చేసిన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ, వెనుక ఏముందో గమనించకుండా ఒక్కసారిగా వాహనాన్ని మళ్లించింది. ఈ క్రమంలో వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జగ్గంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను తొలగించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

