జగ్గంపేట, ఫిబ్రవరి 13: జిల్లా వాణి ప్రతినిధి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు గట్టిగా హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రఘునాథరావు మాట్లాడుతూ..మద్యం సేవించే వారిపై నిఘా ఉంచేందుకు ప్రతిరోజూ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం తాగడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ప్రజల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.

