జగ్గంపేట, జిల్లా వాణి ప్రతినిధి: పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి వద్ద జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు తన సిబ్బందితో కలిసి మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్సై, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఈ తనిఖీల సందర్భంగా ఎస్సై రఘునాథరావు గారు మాట్లాడుతూ..వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది మీ ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదని ఆయన వివరించారు. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతిరోజూ ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ తనిఖీలతో మద్యం ప్రియులు మరియు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో గుబులు మొదలైంది.

