కిర్లంపూడి, ఫిబ్రవరి 22: కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, శనివారం రాత్రి కిర్లంపూడి మండలం ఎస్. తిమ్మాపురం గ్రామంలో కిర్లంపూడి ఎస్సై శ్రీ జి. సతీష్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు సిబ్బందితో కలిసి పర్యటించిన ఎస్సై, గ్రామస్తులతో ముఖాముఖి చర్చించి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా రక్షణకు ‘శక్తి’ ఆయుధం మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ఏపీ పోలీస్ ప్రవేశపెట్టిన ‘శక్తి యాప్’ ప్రాధాన్యతను ఎస్సై వివరించారు. ఇది ప్రతి మహిళకు ఒక రక్షణ కవచం లాంటిదని, ఆపదలో ఉన్నప్పుడు కేవలం క్లిక్ చేస్తే నిమిషాల్లో పోలీసు రక్షణ అందుతుందని తెలిపారు.
ప్రయాణాల్లో భద్రత కోసం ‘సేఫ్ ట్రావెల్’ ఆప్షన్ మరియు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను గట్టిగా ఊపడం ద్వారా (షేక్ ట్రిగ్గర్) కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేసే ‘హ్యాండ్ గెశ్చర్’ ఫీచర్ల గురించి వివరించారు. సైబర్ మోసాలపై అప్రమత్తత ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని, అపరిచిత వీడియో కాల్స్ నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, ఓటిపిలు ఎవరికీ చెప్పకూడదని.. తక్కువ ధరకే వస్తువులు, లైక్ చేస్తే డబ్బులు వంటి మాయమాటలను నమ్మవద్దన్నారు. అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు ఫార్వర్డ్ చేయరాదని, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా విక్రయిస్తున్నా లేదా వాడుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడవద్దని సూచించారు. గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామంలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు నామసాని నాగేశ్వరరావు, సోము నారాయణరావు, గండికోట నాగేశ్వరరావు, గాది దొరబాబు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

