జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో దైవ కార్యకమ్రాలు శనివారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏలేరు నది తీరాన వెలసిన శివకేశవ ఆలయం వద్ద ఈనెల 7, 8, 9 తేదీలలో మూడు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. కార్యక్రమ వివరాలు శనివారం సాయంత్రం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, ఆదివారం ఉదయం సామూహిక సత్యదేవుని వ్రతాలు, సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ సత్యదేవుని కళ్యాణం. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి మహోత్సవం. సుమారు 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, సుప్రసిద్ధ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. శనివారం జరిగే శ్రీనివాస కళ్యాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై, స్వామివార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని జ్యోతుల నెహ్రూ యావన్మంది భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, బుర్రి సత్తిబాబు, అనుకూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

