జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 1: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆదివారం గ్రామంలో పలు నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ప్రత్యేక చొరవ, సహాయ సహకారాలతోనే రామవరం గ్రామంలో ఇప్పటికే మెజారిటీ రోడ్ల నిర్మాణం పూర్తయింది.” “మిగిలి ఉన్న అంతర్గత రోడ్లను కూడా నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం. దీనివల్ల గ్రామస్తుల రవాణా కష్టాలు తీరనున్నాయి.” ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

