జగ్గంపేట, మార్చి 22(జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కాట్రావులపల్లి గ్రామ పరిసరాల్లో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావుకు నమ్మదగిన సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 10,450 నగదును, పేకాట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. అరెస్టయిన వారిపై కేసు నమోదు చేశామని, రేపు ఉదయం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎక్కడైనా జూదం, కోడి పందేలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.

