జగ్గంపేట, ఏప్రిల్ 03 (జిల్లా వాణి ప్రతినిధి): జగ్గంపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య నానాటికీ జటిలమవుతోంది. మరీ ముఖ్యంగా స్థానిక పోలీసు స్టేషన్ ఎదురుగానే వాహనాలను రోడ్డుపై ఇష్టారాజ్యంగా నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యం నీడలో ట్రాఫిక్ నియంత్రణసాక్షాత్తు ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన పోలీసు స్టేషన్ సమీపంలోనే ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొనడం గమనార్హం. స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ద్విచక్ర వాహనాలను పెద్ద ఎత్తున రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. దీనివల్ల గోకవరం వైపు వెళ్లే వాహనదారులకు దారి కరువై, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవాల్సి వస్తోంది. ఈ సమస్యపై బహుజన సమాజ్ పార్టీ (BSP) నియోజకవర్గ ఇంచార్జి జుత్తుక నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..”చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసుల ముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరం. హోటల్ వద్ద సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాలన్నీ రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.” పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి, రోడ్డుపై వాహనాలు నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

