జగ్గంపేట(జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం డ్రైవర్స్ కాలనీ నివాసితుల పట్టాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, మౌలిక సదుపాయాలు సదుపాయాల కల్పనలో వైఫల్యాన్ని ఎండగడుతూ సీపీఎం నాయకుడు కరుణాకుల వీరాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోంది. వీరాంజనేయులు మాట్లాడుతూ, డ్రైవర్స్ కాలనీలో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. 2010లో పట్టాలు పొందిన వారు కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ఆర్థిక స్తోమత లేక పునాదుల దశలోనే ఆగిపోయారని తెలిపారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని పోలీసులు, రెవెన్యూ కార్యదర్శులు వచ్చి అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.సామాజిక సమస్యలు: ఇక్కడి భూములను పేదలు కొనుగోలు చేసి, తమ ఆడపిల్లలకు కట్నకానుకలుగా ఇచ్చారని, ఇప్పుడు ఆ పట్టాల విషయంలో అనిశ్చితి నెలకొనడంతో అల్లుళ్లు కాపురాలు వదిలేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ జోక్యంపై విమర్శలు మరో నేత బండారు రాజా మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు సుమారు 170 నుండి 200 మంది పేదల పట్టాలను రద్దు చేసి, తమ అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.”ఇక్కడ ఉన్నవారంతా పేదలే తప్ప ఎవరూ ఉన్నత స్థాయి వ్యక్తులు లేరు. సామాజిక దృక్పథంతో, మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ, ఉన్న పట్టాలను రద్దు చేయడం సమంజసం కాదు.” అని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళన ఈ ధర్నాలో డ్రైవర్స్ కాలనీకి చెందిన లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పట్టాలనే కొనసాగిస్తూ వారికి శాశ్వత గృహ వసతి, కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

